✴ సమరయ స్త్రీ ✴
(మొదటి బాగము)
దేవుని నామమునకు మహిమ కలుగును గాక!
యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభుల వారు సువార్త ప్రకటిస్తూ మార్గమధ్యంలో సమరయ అనే ప్రాంతం వస్తారు. అక్కడ సుఖారు అనే గ్రామ శివారులో యాకోబుగారు యోసేపుకిచ్చిన బావి దగ్గర అలసినరీతినే కూర్చొన్నారు. అప్పుడు ఇంచుమించు పండ్రెండు గంటలయ్యింది అని వ్రాయబడింది.(4,6 వచనాలు)
👉ఏసుప్రభువు యూదుడు. వెళ్ళిన ప్రాంతం సమరయ.
👉ఇశ్రాయేలు దేశం ప్రాముఖ్యంగా యూదయ, సమరయ, గలలియ అనే మూడు ప్రాంతాలుగా విభజింపబడింది. యూదయ గలలియ ప్రాంతాలకి మధ్యలో ఈ సమరయ ప్రాంతం ఉంది.
👉 అయితే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయుల నీరు త్రాగరు, మాట్లాడరు, భోజనం చేయరు. సమరయులను యూదులు పాపులుగా, వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, *అంటరానివారుగా* పరిగనిస్తారు. చివరకి యూదయనుండి గలలియకు సమరయ మీదుగా దగ్గరదారి అయినా సరే చుట్టూ తిరిగివెల్తారు తప్ప సమరయలో అడుగుపెట్టరు.
✳ ఎందుకు అంటే మనం చరిత్ర తెలుసుకోవాలి.
➡సమరయ అనగా Watch Tower (కాపలా కోట):
అది ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉంది. ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ, షెమెరు అనే వ్యక్తిదగ్గర రెండు తలాంతులకు ఆ కొండను కొని అక్కడ పట్టణం కట్టించి దానికి షోమ్రోను(సమరయ) అని పేరు పెట్టినట్టు చూస్తాం 1 రాజులు 16వ అధ్యాయం. కాలక్రమేనా ఈ పట్టణం అనేకసార్లు దాడికి గురిచేయబడ్డాది. (1,2వ రాజులు). సమరయులు అనే పేరు ఎలా వచ్చిందంటే క్రీ.పూ. 677- 721 మధ్యలో ఏషర్హద్దోన్ అనే అస్సూరు రాజు ఆప్రాంతాన్ని జయించి ఇశ్రాయేలీయులను చెరపట్టి, అస్సూరు రాజ్యానికి తీసుకొనిపోయాడు. ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఈ సమరయ ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ పెడతాడు. ఈ రకంగా వచ్చిన మిశ్రమ జాతి వారే సమరయులు.(2రాజులు 17: 24-41). ఇది దేవునికి ఇష్టంలేని పని. అందువల్ల దేవుడు సింహాలను పంపుతారు. తర్వాత వారు తమ విగ్రహాలను విడచిపెట్టి క్రమక్రమంగా యూదుల ఆచారాలను, యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెడతారు. (ఎజ్రా 4:2,9,10; లూకా 17:18). అయితే యూదులు/ఇశ్రాయేలీయులు చెర విముక్తి పొందిన తర్వాత దైవాజ్న మేరకు మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ సమరయులు మేము కూడా మీ దేవున్నే ప్రార్దిస్తున్నాం. మేము కూడా మీతోపాటు మందిరాన్ని కడతాం అంటే జెరుబ్బాబెలు, యెశూవ అనే పెద్దలు దానికి అంగీకరించరు. నెహేమ్యా గారైతే ఏకంగా మీకు మాలో పాలైనను, స్వాస్త్యమైనను లేదని ఖరాఖండిగా చెబుతారు. అప్పటినుండి యూదులకు/ఇశ్రాయేలీయులుకు మధ్య వైరం మొదలైంది. చివరకు సమరయులు గెరీజీము కొండమీద ఒక మందిరాన్ని కట్టుకొంటే క్రీ.పూ. 139 లో ఒక యూదురాజు దానిని పడగొట్టినట్లు చరిత్ర చెబుతుంది. అప్పుడు వారు సమరయ అనగా షెకెము కొండమీద ఒకమందిరాన్ని కట్టుకొని ఆరాదించడం మొదలు పెట్టారు. ఈ రకంగా ఈ రెండుజాతులకు మధ్య వైరం యేసయ్య వచ్చేవరకూ కూడా కొనసాగింది. ఇప్పటికి కూడా 160 సమరయ కుటుంబాలు ఈప్రాంతంలో నివాసం చేస్తున్నారు.
అయితే ఇటువంటి *అంటరానిప్రాంతంగా, పాపపు ప్రాంతంగా,దొంగలతో నింపబడిన ప్రాంతంగా, ప్రజలందరితోను వెలివేయబడిన ప్రాంతానికి, ఏ ప్రవక్త, బోధకుడు కూడా వెళ్ళని, వెళ్ళడానికి భయపడే ప్రాంతానికి లోకరక్షకుడైన యేసయ్య తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించారు*. ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదట దర్శించిన స్త్రీ మామూలు వ్యక్తికాదు. ఏ మాత్రం మంచిసాక్ష్యం లేని ఒక వ్యక్తిని ఎన్నుకొని, ఆ ప్రాంతాన్ని మార్చిన వైనం నిజంగా అధ్బుతం! ఆయన ఆశ్చర్యకరుడు! ఆలోచనకర్త! నిత్యుడగు తండ్రి! సమాధాన కర్త!
👉ఈరోజు నీవు కూడా ప్రజలందరితోను వెలివేయబడ్డావా? అందరూ నిన్ను ఎందుకూ పనికిరానివాడు/పనికిరానిది అని హేలనచేస్తున్నారా? నీవు అంటరానికులంలో పుట్టావు అని హేలనచేస్తున్నారా? నీ భర్త, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ నిన్ను విడచిపోయారా? భయపడొద్దు! పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈలోకానికి వచ్చారు. ఎవరైతే పాపులో, వెలివేయబడ్డారో, అంటరానివారిగా ఎంచబడ్డారో వాళ్ళ దగ్గరికే యేసయ్య వచ్చారు. ఈలోకంలో ఘనులైన వారిని వ్యర్ధం చేయడానికి ఎన్నికలేనివారిని ఆయన ఎన్నుకొన్నారు.
👉ఆయనకి నీవుకావాలి! ప్రయాసబడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి అని పిలుస్తున్నారు. ఆయన వద్దకు వస్తావా? వస్తే ఆయన నీపాపాన్ని కడిగి నిన్ను శుద్ధిచేసి పరలోకవారసునిగా చేస్తారు. విలువలేని నీకు విలువ నిస్తారు. అట్టి కృప మనందరికీ కలుగును గాక!
ఆమెన్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి